Telangana: నదీ జలాల పేరుతో కేసీఆర్, జగన్ విద్వేషాలు: తమ్మినేని వీరభద్రం
- కోర్టు ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి: తమ్మినేని
- జల వివాదం ఓ డ్రామా: దాసోజు శ్రవణ్
- కేసీఆర్‌కు రైతు సంఘాల లేఖ
నదీ జలాల పేరుతో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ట్రైబ్యునల్ వాటి తీర్పుల ఆధారంగా నీటి కేటాయింపుల్లో తేడాలు వస్తే కోర్టులను ఆశ్రయించవచ్చని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కానీ అది మానేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
కాగా, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నిన్న గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం ఓ డ్రామా అని విమర్శించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇరు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్-2 తీర్పు త్వరలోనే వెలువడేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.