Pawan Kalyan: ఎస్వీ రంగారావు గారి అభినయం అనితర సాధ్యం: పవన్ కల్యాణ్

Pawan Kalyan pays tributes legendary SV Rangarao on his birth anniversary

  • నేడు ఎస్వీఆర్ జయంతి
  • మహానటుల్లో అగ్రగణ్యుడన్న పవన్ కల్యాణ్
  • అలవోకగా డైలాగులు చెబుతారని కితాబు
  • చిరకీర్తిని ఆర్జించారన్న పవన్ కల్యాణ్

తెలుగు చలనచిత్ర చరిత్రలో మహానటుడిగా ఖ్యాతి గడించిన ఎస్వీ రంగారావు జయంతి నేడు. ఈ సందర్భంగా జనసేనాని, టాలీవుడ్ అగ్రహీరో పవన్ కల్యాణ్ స్పందించారు. ఎస్వీ రంగారావు గారి నటన అనితర సాధ్యం అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు చలనచిత్రాన్ని పరిపుష్టం చేసిన మహానటుల్లో ఎస్వీఆర్ అగ్రగణ్యులని కొనియాడారు. చిన్న డైలాగును కూడా ప్రభావశీలమైన తన హావభావాలతో రక్తి కట్టించేవారని, కఠిన సమాసాలతో కూడిన పెద్ద డైలాగులను సైతం అలవోకగా పలికి సన్నివేశాన్ని పండించేవారని కితాబునిచ్చారు. అంతటి ప్రతిభాశాలి ఎస్వీఆర్ అంటూ కీర్తించారు.

ఇవాళ ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానటుడ్ని స్మరించుకుంటూ తన తరఫున, జనసేన తరఫున అంజలి ఘటిస్తున్నట్టు పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. పౌరాణికం, జానపదం, సాంఘిక చిత్రాల్లో ఆయన ఏ పాత్ర పోషించినా మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అభినయాన్ని ప్రదర్శించేవారని ప్రస్తుతించారు. విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా పాత్రకు జీవం పోసేవారని వెల్లడించారు. అందుకే కీచకుడిగా, ఘటోత్కచుడిగా, నేపాళ మాంత్రికుడిగా, హిరణ్యకశిపుడిగా, అక్బర్, భోజరాజు, తాండ్రపాపారాయుడు, తాతామనవడులో తాతగా... ఏ పాత్రలో అయినా ఎస్వీఆరే జ్ఞప్తికి వస్తారని పవన్ వివరించారు.

ఒక నటుడిగా ఎస్వీ రంగారావు గారు చిరకీర్తిని ఆర్జించారని, ఆయనను భావి తరాలు కూడా స్మరించుకుంటూనే ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఏ మీడియాలో చూసినా ఆయన నటించిన చిత్రాలు, వాటికి సంబంధించిన విశేషాలే దర్శనమిస్తున్నాయని వెల్లడించారు. వాటిని చూస్తుంటే ఎస్వీఆర్ మనపై ఎంతటి బలమైన ముద్ర వేశారో అర్థమవుతోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News