Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి... ఆమోదం తెలిపిన బీజేపీ శాసనసభాపక్షం

Pushkar Singh Dhami as Uttarakhand new CM

  • సీఎం పదవికి రాజీనామా చేసిన తీరథ్ సింగ్
  • సమావేశమైన ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్షం 
  • ఖతిమా నియోజకవర్గం నుంచి గెలిచిన పుష్కర్

ఎవరూ ఊహించని రీతిలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో ఆయన వారసుడి ఎంపిక కోసం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర్ సింగ్ ధామి సీఎం బాధ్యతలు చేపడతారంటూ ఈ సమావేశంలో నిర్ణయించారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ల పేర్లు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే, ఖతిమా నియోజకవర్గ ఎమ్మెల్యే పుష్కర్ సింగ్ ధామి వైపు అత్యధికులు మొగ్గు చూపారు.

ఇవాళ ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేలు డెహ్రాడూన్ లో సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశానికి కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరయ్యారు. నూతన సీఎంగా అవకాశం దక్కించుకున్న పుష్కర్ సింగ్ మరికొన్నిరోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

పుష్కర్ సింగ్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. 45 ఏళ్ల పుష్కర్ సింగ్ న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. బీజేపీ రాష్ట్ర జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ అధినాయకత్వం నమ్మకాన్ని చూరగొన్నారు.

కాగా, సంక్షోభ సమయంలో తనను సీఎంగా ఎన్నుకోవడం పట్ల పుష్కర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి, పార్టీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం పదవి ఓ సవాల్ వంటిదేనని, అయితే పార్టీ అండతో దీన్ని అధిగమిస్తానని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి ఇప్పటిది కాదు. గత మార్చిలో త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి తప్పుకోగా, తీరథ్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆయన ఎంపీగా ఉండడంతో, ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి నెగ్గడం అనివార్యమైంది. కానీ, ఇప్పటి పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం కష్టసాధ్యం. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ హైకమాండ్ ను ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో సీఎంగా పుష్కర్ సింగ్ ను ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News