Arjuna Ranatunga: భారత ద్వితీయ శ్రేణి జట్టుతో ఆడేందుకు అంగీకరిస్తారా?: శ్రీలంక క్రికెట్ బోర్డుపై అర్జున రణతుంగ ధ్వజం

Arjuna Ranatunga calls Dhawan led India a second class team

  • ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న కోహ్లీ సేన
  • అదే సమయంలో శ్రీలంక పర్యటన
  • ధావన్ నాయకత్వంలో మరో జట్టు ఎంపిక
  • ఇది 'బి' టీమ్ అంటున్న రణతుంగ 
  • శ్రీలంక హుందాతనం దెబ్బతింటోందని ఆవేదన

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లండ్ టూర్ లో ఉండడంతో, అదే సమయంలో శ్రీలంక పర్యటన ఖరారైంది. దాంతో బీసీసీఐ శిఖర్ ధావన్ నేతృత్వంలో మరో జట్టును ఎంపిక చేసి శ్రీలంక పర్యటనకు పంపింది. దీనికి శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా సమ్మతించింది. అయితే, ఈ అంశంపై శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భారత ద్వితీయశ్రేణి జట్టుతో ఆడేందుకు అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు. ఇది శ్రీలంక హుందాతనాన్ని దెబ్బతీసే నిర్ణయం అంటూ దేశ క్రీడల మంత్రి నమల్ రాజపక్స పైనా, లంక క్రికెట్ బోర్డుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

జులై 13 నుంచి భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ లు జరగనున్నాయి. ధావన్ నేతృత్వంలోని భారత జట్టులో ప్రతిభకు లోటు లేదు. అయితే, రణతుంగ మాత్రం ఇది ద్వితీయ శ్రేణి జట్టు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.

"ప్రస్తుతం శ్రీలంక వచ్చిన భారత జట్టు వారి అత్యుత్తమ జట్టు కాదు. ఇదొక ద్వితీయ శ్రేణి జట్టు. దేశ క్రీడల మంత్రికి, క్రికెట్ బోర్డు పెద్దలకు ఈ విషయం తెలియదా?" అంటూ ప్రశ్నించారు. ర్యాంకింగ్స్ లో శ్రీలంక కిందికి పడిపోయి ఉండొచ్చు గాక, కానీ క్రికెట్ ఆడే దేశంగా శ్రీలంకకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. భారత బి జట్టుతో మన అత్యుత్తమ జట్టును ఆడించరాదు" అంటూ పేర్కొన్నారు.

భారత బి జట్టుతో ఆడేందుకు అంగీకరించడం వెనుక ప్రధాన కారణం టెలివిజన్ ప్రసారహక్కులేనని రణతుంగ ఆరోపించారు. ప్రత్యర్థి బి టీమ్ అయినా సరే మ్యాచ్ లు ఆడించి డబ్బు సంపాదించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోందని విమర్శించారు. దేశంలో క్రికెట్ ను భ్రష్టు పట్టించారని, సమూల ప్రక్షాళన అవసరమని రణతుంగ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News