V Srinivas Goud: మేం వారిని తెలంగాణ వాళ్లుగా భావిస్తుంటే... ఏపీ వాళ్లే సెటిలర్లు అంటున్నారు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన జలవివాదం
- కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్
- ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రి
- ఏపీది వితండవాదమని వివరణ
- సెటిలర్ల ప్రస్తావనపై స్పష్టీకరణ
తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడున్న సీమాంధ్రులకు ఏం కష్టం వచ్చిందో చెప్పాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీ పాలకులను ప్రశ్నించారు. ఇక్కడున్న ఆంధ్రా వాళ్లను కూడా తాము తెలంగాణ వారిగానే భావిస్తుంటే, ఏపీ వాళ్లు మాత్రం వారిని సెటిలర్లు అని పిలుస్తున్నారని ఆరోపించారు. వారు ఒకప్పుడు సెటిలర్లు కావొచ్చేమో కానీ, ఇప్పుడు కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు వాళ్లంతా తెలంగాణ ప్రజలేనని ఉద్ఘాటించారు.
తెలంగాణ ఉద్యమం కొనసాగిన రోజుల్లోనూ తాము సెటిలర్లు అనే పదం వాడలేదని, కానీ ఇప్పటికీ వారిని అదే పేరుతో పిలుస్తున్నారని ఆరోపించారు. వారంతా తెలంగాణ ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని, వారు ఎప్పటికీ తెలంగాణ వారేనని స్పష్టం చేశారు. తమ పోరాటం ఏపీ ప్రభుత్వంపైనే తప్ప, ఏపీ ప్రజలపై కాదని చెప్పుకొచ్చారు.
నదీ జలాల వినియోగంపై తాము నిబంధనలు అతిక్రమించలేదని, జీవోల ప్రకారమే నడుచుకుంటున్నామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జల వివాదాలపై ఏపీ వితండవాదం చేస్తోందని, కేంద్రం తమకు న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. లేకపోతే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయడంపై స్పందిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలవిద్యుదుత్పత్తిని కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం జలవిద్యుత్ ఉత్పాదన అని తేల్చి చెప్పారు.
తెలంగాణ నిర్మిస్తున్నవి అక్రమ ప్రాజెక్టులు అంటున్నారని, మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, చంద్రబాబు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తి జీవోలా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఒకవేళ వారు ఇచ్చిన జీవోలు తప్పు అంటే, అవి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఇచ్చిన జీవోలు అని భావించాల్సి ఉంటుందని అన్నారు.