Andhra Pradesh: శ్రీశైలం డ్యామ్ వద్ద మోహరించిన ఆంధ్ర, తెలంగాణ పోలీసులు
- నీటిని అక్రమంగా వాడుకుంటున్నారంటూ ఇరు రాష్ట్రాల ఆరోపణలు
- ప్రతి రోజు 4 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటోందన్న ఏపీ
- సాగర్, పులిచింతల, జూరాల వద్ద కూడా పోలీసు బందోబస్తు
కృష్ణా జలాల వివాదం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతోంది. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని సాగిస్తుండగా... ఏపీ ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయడం లేదు. తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ప్రతి రోజు 4 టీఎంసీల నీరు దిగువకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీంతో, ఎడమగట్టు వద్ద తెలంగాణ పోలీసులు, కుడిగట్టు వద్ద ఆంధ్ర పోలీసులు మోహరించారు.
లెక్క ప్రకారం శ్రీశైలం డ్యామ్ లో 854 అడుగుల కంటే ఎక్కువ నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉంటుంది. నీటిని తరలించకుంటే రాయలసీమ ఎడారి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి రోజు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకుంటుండటంతో నీటిమట్టం ఆ స్థాయికి చేరడం లేదని ఏపీ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఈ జల వివాదం నేపథ్యంలో శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.