vaccine: జైడస్‌ క్యాడిలా నుంచి 3 డోసుల‌ భార‌తీయ టీకా.. అనుమ‌తుల కోసం ద‌ర‌ఖాస్తు

Zydus Cadila seeks emergency use authorisation for ZyCoVD COVID19 vaccine for 12 years above

  • 12 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయ‌డానికి ద‌రఖాస్తు
  • రెండో దేశీయ క‌రోనా టీకా
  • 28 వేల మంది వాలంటీర్ల‌పై ప్రయోగాలు పూర్తి
  • ప్ర‌పంచపు తొలి క‌రోనా డీఎన్ఏ వ్యాక్సిన్  ఇదే

దేశంలో వ్యాక్సిన్‌ కొరత నెల‌కొన్న నేప‌థ్యంలో త్వరలో మరో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జై కొవ్‌-డీ వ్యాక్సిన్ త్వ‌ర‌లో అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. 12 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్లు వేయ‌డానికి అత్యవసర వినియోగ అనుమతి కోసం ఆ సంస్థ డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఈ రోజు ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

త‌మ‌ టీకా మూడో ద‌శ‌ క్లినికల్‌ ట్రయల్స్ కూడా ఇటీవలే ముగిశాయని ఆ సంస్థ తెలిపింది. జై కొవ్‌-డీ వ్యాక్సిన్  డీఎన్‌ఏ టీకా అని, వైరస్‌కు సంబంధించిన జన్యుకోడ్‌ను మన శరీరంలోకి తీసుకెళ్తుంద‌ని, దీంతో వ్యాధి నిరోధ‌క శ‌క్తి వ‌స్తుంద‌ని ఆ సంస్థ తెలిపింది. జై కొవ్‌-డీ వ్యాక్సిన్ ప్ర‌పంచంలోనే క‌రోనా క‌ట్ట‌డికి అభివృద్ధి చేసిన‌ తొలి డీఎన్ఏ టీకా. ఇప్ప‌టికే దేశీయంగా కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసి వినియోగిస్తోన్న విష‌యం తెలిసిందే.  

జై కొవ్‌-డీ వ్యాక్సిన్ ఆమోదం పొందితే రెండో దేశీయ క‌రోనా టీకాగా నిలుస్తుంది. ఈ టీకా గురించి ఇటీవ‌లే నీతి ఆయోగ్ ఆరోగ్య‌ సభ్యుడు వీకేపాల్ మాట్లాడుతూ... 28 వేల మంది వాలంటీర్ల‌పై ఆ సంస్థ ప్రయోగాలు జరిపిందని వెల్ల‌డించారు. దీనిపై అధ్యయనం దాదాపు ముగిసింద‌ని అన్నారు. త్వ‌ర‌లోనే ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని అన్నారు. ఇదే ప్ర‌పంచపు తొలి క‌రోనా డీఎన్ఏ వ్యాక్సిన్ అని ఆయ‌న కూడా తెలిపారు.  

అత్యవసర అనుమతులు లభించగానే టీకా ఉత్పత్తిని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలకు అనుమ‌తులు ల‌భించిన విష‌యం తెలిసిందే. ఆయా వ్యాక్సిన్లు రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. జై కొవ్‌-డీ వ్యాక్సిన్ మాత్రం మూడు డోసుల వ్యాక్సిన్.

తొలి డోసు వేయించుకున్న త‌ర్వాత 28 రోజుల‌కి రెండో డోసు, 56 రోజుల‌కి మూడోది  వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ చాలా కాలం నిల్వ ఉండాలంటే 2-8 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద, కొద్ది కాలం నిల్వ ఉండాలంటే 25 డిగ్రీల సెల్సియ‌స్ వ‌ద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. 

  • Loading...

More Telugu News