World Bank: భారత్‌లోని అసంఘటిత రంగ కార్మికులకు రూ. 3,717 కోట్ల కరోనా రుణం.. ప్రపంచ బ్యాంకు ఆమోదం
- మొత్తం రుణంలో 22.5 శాతం అంతర్జాతీయ సమాజం నుంచి, 77.5 శాతాన్ని ఐబీఆర్‌డీ నుంచి సేకరణ
- తాజా రుణ చెల్లింపునకు 18.5 ఏళ్ల గడువు
- పేదలు, నిస్సహాయుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఉపయోగం
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న దేశంలోని అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. కరోనా రుణం రూపంలో రూ. 3,717 కోట్ల రుణాన్ని అందించేందుకు నిన్న ఆమోదం తెలిపింది. ఇందులో 22.5 శాతం రుణాన్ని అంతర్జాతీయ అభివృద్ధి సమాజం నుంచి సేకరించగా, మిగతా 77.5 శాతం రుణాన్ని అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు (ఐబీఆర్‌డీ) నుంచి సమకూర్చినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
దేశంలోని పేదలు, నిస్సహాయుల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ రుణాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే, గతేడాది ఆమోదించిన రెండు ముఖ్యమైన అంశాల్లో ఒకటైన జాతీయ సామాజిక భద్రత పథకం కింద గుర్తించిన 32 కోట్ల మంది లబ్ధిదారులకు అదనపు ఆహార ధాన్యాలను అందించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. తాజా రుణానికి ఐదేళ్ల అదనపు పొడిగింపుతో కలిపి 18.5 ఏళ్ల గడువు ఉంటుంది.