G Jagadish Reddy: ఇది తెలంగాణ, ఇక్కడ కేసీఆర్ ఉన్నారు... ఏపీ సర్కారుపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపాటు

Telangana minister Jagadish Reddy fires on AP govt

  • మరింత ముదిరిన జలయుద్ధం
  • తాజాగా విద్యుదుత్పత్తిపై ఇరు రాష్ట్రాల మధ్య జగడం
  • డెడ్ లైన్ నిల్వతోనూ కరెంటు ఉత్పత్తి చేస్తున్నారన్న ఏపీ మంత్రులు
  • ఘాటుగా బదులిచ్చిన తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి

నీటి ప్రాజెక్టులు రగిల్చిన అగ్గి తెలుగు రాష్ట్రాల మధ్య మరింతగా భగ్గుమంటోంది. తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఏపీ పాలకులపై ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఇది తెలంగాణ, ఇక్కడున్నది కేసీఆర్... మీరెవరు మాకు చెప్పడానికి? అంటూ మండిపడ్డారు. శ్రీశైలం జల విద్యుదుత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. నీళ్లు ఉన్నంతకాలం విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసి తీరుతామని తమ వైఖరిని చాటారు. విద్యుదుత్పత్తి తమ హక్కు అని జగదీశ్ రెడ్డి ఉద్ఘాటించారు.

ఇతర ప్రాంతాల ప్రజలను తాము అతిథుల్లా గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడి ప్రజల బాగోగులపైనే ఏపీ సర్కారుకు శ్రద్ధలేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని ఆరోపించారు. దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేస్తున్నారని, ఇకనైనా కుప్పిగంతులు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

నేడు ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ, తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నందునే ఆచితూచి మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. అటు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్ లైన్ స్టోరేజి లెవల్ కి చేరినప్పటికీ తెలంగాణలో విద్యుదుత్పత్తి చేస్తున్నారంటూ ఏపీ మంత్రులు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News