Telangana: హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల నిరసన
- కృష్ణా జలాలపై వైఖరి చెప్పాలని డిమాండ్
- వాగ్వాదానికి దిగిన షర్మిల మద్దతుదారులు
- రైతులను స్టేషన్ కు తరలించిన పోలీసులు
హైదరాబాదులోని వైఎస్ షర్మిల ఇంటి ముందు ఏపీ రైతులు ధర్నాకు దిగారు. కృష్ణా నీళ్ల విషయంలో వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణకు దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్కనూ వదులుకోబోమని రెండ్రోజుల క్రితం వైఎస్ షర్మిల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దాని కోసం ఎవరినైనా ఎదిరిస్తానని ఆమె అన్నారు. ఆ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని రైతులు మండిపడ్డారు. ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా.. షర్మిల మద్దతుదారులు అడ్డుకున్నారు. రైతులతో వాగ్వాదానికి దిగారు.
కృష్ణా నీళ్ల విషయంలో షర్మిల తన వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు రాయలసీమ రైతులకు నష్టం చేసేలా ఉన్నాయన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.