Heat Wave: కెనడాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడి గాలులు... ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు!
- అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కూడా
- ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
- పలు చోట్ల నిర్మానుష్యమైన రహదారులు
కెనడా ప్రజలను వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యంత అరుదుగా వీచే వేడి గాలులు ఇప్పుడు ప్రజల జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. జాతీయ రహదారులు నిర్మానుష్యం కాగా, ప్రజా రవాణా దాదాపుగా నిలిచిపోయింది. చాలా చోట్ల విద్యుత్ కు డిమాండ్ పెరిగి, కరెంట్ సరఫరాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. మంగళవారం కెనడాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
లైటన్ లోని వాతావరణ కేంద్రంగా 49.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, ఇది కెనడా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డని అధికారులు వ్యాఖ్యానించారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొని ఉంది. పశ్చిమ వాషింగ్టన్, ఓరెగాన్, ఇడాహో ప్రాంతాల్లో 3.40 లక్షల మందికి సేవలందిస్తున్న తమ సంస్థ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు 9,300 డెలివరీలకు అవాంతరాలు ఏర్పడ్డాయని అవిస్టా కార్పొరేషన్ ప్రకటించింది. ఇక పోర్ట్ లాండ్ లో స్ట్రీట్ కార్ కేబుల్స్ దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ దెబ్బతింది.
గడచిన 40 సంవత్సరాల చరిత్రలో తాను ఎన్నోమార్లు వాతావరణ అంచనాలు వెలువరించానని, అయితే, ఇంత ఘోరమైన పరిస్థితి ఎన్నడూ రాలేదని పెన్సిల్వేనియాలోని ఆక్యూ వెదర్ ఐఎన్సీ నిపుణుడు పాల్ వాకర్ వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదకర హీట్ వేవ్ కొనసాగుతుందని న్యూయార్క్ వాతావరణ విభాగం హెచ్చరించింది.