T20 World Cup: ఐసీసీ 'టీ20 వరల్డ్ కప్' ఇండియా నుంచి దుబాయ్, ఒమన్ లకు తరలింపు
- అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్
- కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి గల్ఫ్ కు తరలింపు
- టోర్నీని హోస్ట్ చేసే అధికారం బీసీసీఐదే
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగబోతోంది. వాస్తవానికి ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నీని కరోనా నేపథ్యంలో యూఏఈ, ఒమన్ లకు ఐసీసీ తరలించింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, టోర్నీని హోస్ట్ చేసే అధికారం మాత్రం బీసీసీఐకి ఐసీసీ కల్పించింది. టీ20 వరల్డ్ కప్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాభిలోని షేక్ జయేద్ స్టేడియం, షార్జా స్టేడియం, ఒబన్ క్రికెట్ అకాడెమీ గ్రౌండ్లలో జరగనుంది.
టోర్నీ తొలి రౌండులో ఎనిమిది క్వాలిఫయింగ్ జట్లు పాల్గొంటాయి. ఈ జట్లలో నాలుగు టీమ్ లు సూపర్-12కి క్వాలిఫై అవుతాయి. సూపర్-12 రౌండ్లో ఈ నాలుగు జట్లు మరో ఎనిమిది ఆటోమేటిక్ క్వాలిఫయర్స్ తో పోటీ పడతాయి.
తొలి రౌండ్లో పోటీ పడే దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూ గినియా ఉన్నాయి. ఆటోమేటిక్ క్వాలిఫయర్స్ లో ఇతర దేశాలు ఉన్నాయి.
ఈ సందర్భంగా ఐసీసీ సీఈవో జెఫ్ అల్లార్డైస్ మాట్లాడుతూ, ఇండియా నుంచి టోర్నీని తరలిస్తుండడం బాధాకరమని అన్నారు. అయితే, ఏదో ఒక దేశంలో బయో సెక్యూర్ వాతావరణంలో టోర్నీని నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గల్ఫ్ లో టోర్నీ జరుగబోతున్నప్పటికీ, బీసీసీఐతో కలిసి తాము పని చేస్తామని తెలిపారు. క్రికెట్ వేడుకను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, ఒమన్ క్రికెట్ అద్భుతంగా నిర్వహిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ, యూఏఈ, ఒమన్ లో టీ20 ప్రపంచ కప్ ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ టోర్నీ ఇండియాలో జరిగితే బాగుండేదని, అయితే కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గల్ఫ్ లో ఈ టోర్నీని అద్భుతంగా నిర్వహిస్తామని అన్నారు.