army: జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోను కలకలం
- ఈ రోజు తెల్లవారు జామున కనపడ్డ డ్రోను
- కుంజ్వాని, సుంజ్వాన్, కలుచక్ ప్రాంతాల్లో తిరిగిన వైనం
- ఆయా ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకుంటోన్న భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్‌లో వరుసగా మూడో రోజు కూడా డ్రోను సంచరిస్తూ కనపడడం కలకలం రేపుతోంది. ఈ రోజు తెల్లవారు జామున 2.30 గంటలకు కుంజ్వాని ప్రాంతంలో ఓ డ్రోన్ తిరిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అదే డ్రోను సుంజ్వాన్, కలుచక్ ప్రాంతాల్లోనూ కనపడినట్లు తెలిసింది. ఈ డ్రోనును కూడా భద్రతా బలగాలు కూల్చలేకపోయాయి. ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి.
కాగా, జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన వైమానిక స్థావరంపై ఆదివారం తెల్లవారు జామున రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. నిన్న కూడా జమ్ములోని రాత్నుచక్-కాలుచక్ మిలిటరీ ఏరియా వద్ద రెండు డ్రోన్లు కలకలం రేపాయి. ఈ ఘటనలు మరవకముందే ఈ రోజు మరోసారి డ్రోను కనపడడం గమనార్హం. పాక్ డ్రోన్ల సాయంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడం పట్ల భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్ము మిలిటరీ స్టేషన్‌కు ఈ ప్రాంతాలు దగ్గరలోనే ఉంటాయి.