Kamal Haasan: మేమేమీ మూడు కోతులం కాదు... కొత్త సినిమా చట్టంపై కమలహాసన్ మండిపాటు!
- సినిమాటోగ్రఫీ చట్టానికి మార్పులు
- కొత్త చట్టంపై ఇప్పటికే పరిశ్రమ ఆగ్రహం
- తాజాగా గళం విప్పిన కమల్
ప్రతిపాదిత సినిమాటోగ్రఫీ చట్టం 2021పై వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి దక్షిణాది నటుడు కమలహాసన్ మద్దతు పలికారు. కొత్త చట్టం ప్రకారం, సినిమాకు సర్టిఫికెట్ వచ్చిన తరువాత కూడా, దాన్ని పునఃపరిశీలించి, దాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.
ఇదే సమయంలో ఫిల్మ్ సర్టిఫికెట్ అపిలేట్ ట్రైబ్యునల్ ను కూడా రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చాలా మంది నిర్మాతలు, చిత్ర ప్రముఖులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, కమల్ సైతం తన బాణీని వినిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, తామేమీ 'వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు' అనేలా ఉండే మూడు కోతులం కాదని మండిపడ్డారు.
భారత చిత్ర పరిశ్రమను స్వతంత్రంగానే ఉంచాలని, ఇందుకోసం పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. కేంద్రం ప్రతిపాదించిన కొత్త చట్టం సినీ పరిశ్రమ స్వతంత్రతను హరిస్తుందని, అది రాజ్యాంగానికి విరుద్ధమని ఇప్పటికే పలువురు సినీ పెద్దలు ఆరోపించిన సంగతి తెలిసిందే. గత వారంలో ఈ ముసాయిదా బిల్లును విడుదల చేసిన కేంద్రం, దీనిపై పరిశ్రమ పెద్దల అభిప్రాయాలను కోరుతూ జులై 2 వరకూ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.