Social Media: ఎట్టకేలకు తప్పు తెలుసుకొని వెనక్కి తగ్గిన ట్విట్టర్!
- భారత దేశం మ్యాపును తప్పుగా చూపిన ట్విట్టర్
- జమ్మూకశ్మీర్, లడఖ్‌ను భారత్ వెలుపల చూపిన ట్విట్టర్
- దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి
- కఠిన చర్యలకు కేంద్రం యోచన
భారత మ్యాపును తప్పుగా చూపిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రభుత్వం సహా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడంతో మ్యాపును వెబ్‌సైట్ నుంచి తొలగించింది.
జమ్మూకశ్మీర్, లడఖ్ లను భారత్ వెలుపల ప్రాంతాలుగా చూపుతూ ట్విట్టర్ తన వెబ్‌సైట్లో ట్వీప్ లైఫ్ అనే సెక్షన్‌లో తప్పుడు మ్యాపును ఉంచిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
దేశ మ్యాపును తప్పుగా చూపించడం చట్టరీత్యా నేరమని.. దీనికి భారీ జరిమానాతో పాటు దేశంలోని సంస్థ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఈ తరహా తప్పిదాలకు పాల్పడ్డ ట్విట్టర్‌ను ఈసారి గట్టిగానే హెచ్చరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
దీనిపై భాజపా సీనియర్ నేత మురళీధర్ స్పందించారు. ట్విట్టర్ చర్యలు భారత ప్రయోజనాల పట్ల వివక్ష చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దేశీయ చట్టాలను ట్విట్టర్ పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.