Telangana: తెలంగాణలో 97 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
- గత 24 గంటల్లో 1,12,982 కరోనా పరీక్షలు
- 993 మందికి కరోనా పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 124 మందికి కరోనా
- అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు
- రాష్ట్రంలో 9 మంది మృతి
తెలంగాణలో కరోనా కొత్త కేసుల ఉద్ధృతి మరింత తగ్గగా, రాష్ట్రంలో రికవరీ రేటు బాగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల రికవరీ రేటు 97.18 శాతంగా నమోదైంది. జాతీయస్థాయిలో రికవరీ రేటు 96.76 శాతంగా ఉంది. ఇక, రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల విషయానికొస్తే... గడచిన 24 గంటల్లో 1,12,982 కరోనా పరీక్షలు నిర్వహించగా, 993 మందికి కరోనా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 124 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 1,417 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,644కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,21,606 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,04,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,869 మంది చికిత్స పొందుతున్నారు.