Phil Whitticase: ఇంగ్లండ్-శ్రీలంక సిరీస్ లో మ్యాచ్ రిఫరీకి కరోనా... లంకలో టీమిండియా పర్యటనపై ఆందోళన!
- క్రికెట్లో కరోనా కలకలం
- శనివారం ఇంగ్లండ్, లంక జట్ల మధ్య టీ20 మ్యాచ్
- రిఫరీ ఫిల్ విట్టికేస్ కు కరోనా పాజిటివ్
- రేపటి వన్డేపై నీలి నీడలు
- మరికొన్నిరోజుల్లో లంక-భారత్ సిరీస్
ప్రస్తుతం ఇంగ్లండ్ లో శ్రీలంక జట్టు పర్యటిస్తోంది. అయితే మూడో టీ20 సందర్భంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో మ్యాచ్ రిఫరీ ఫిల్ విట్టికేస్ కు పాజిటివ్ వచ్చింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర అధికారులు హడలిపోతున్నారు. మ్యాచ్ రిఫరీ విట్టికేస్ కు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఆయన మ్యాచ్ లో విధులు కూడా నిర్వర్తించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు టెస్టు రిపోర్టు పాజిటివ్ అని రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతానికి ఇతరులెవ్వరికీ పాజిటివ్ రాలేదు. కానీ, నిబంధనల ప్రకారం రిఫరీతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉండకతప్పదు. దాంతో, రేపు జరగాల్సిన మొదటి వన్డే అనుమానాస్పదంగా మారింది.
అదలా ఉంచితే... ఈ సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు స్వదేశానికి చేరుకుని... శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ లో లంక ఆటగాళ్లెవరైనా కరోనా బారినపడి, తమతో ఆడేందుకు వస్తే తమ పరిస్థితి ఏంటని భారత ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో భారత పర్యటన జులై 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం టీమిండియా ఇవాళే శ్రీలంక పయనమైంది.