Student: బాలిక నుంచి 10 మామిడి పండ్లను రూ. 1.2 లక్షలకు కొన్న వ్యాపారవేత్త
- స్మార్ట్ ఫోన్ లేక ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయిన తులసి
- మామిడి పండ్లు అమ్మి డబ్బు పోగుచేయాలనుకున్న చిన్నారి
- చిన్నారి కోసం భారీ ధరకు పండ్లు కొనుగోలు చేసిన హెటే అనే వ్యాపారవేత్త
మనుషుల్లో మంచితనం, సేవా గుణం ఇంకా బతికే ఉన్నాయని చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే, ఝార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన తులసి కుమారి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతోంది. కరోనా వల్ల పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఆన్ లైన్ క్లాసులు వినేందుకు ఆమెకు స్మార్ట్ ఫోన్ లేకపోయింది. ఫోన్ కొనేందుకు ఆమె తండ్రికి ఆర్థిక స్తొమత సరిపోలేదు. దీంతో, రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్మి, డబ్బును కూడబెట్టాలని తులసి భావించింది. ఈ విషయం మీడియా ద్వారా ప్రసారమైంది.
తులసి విషయాన్ని హమేయ హెటే అనే వ్యాపారవేత్త తెలుసుకున్నారు. వెంటనే కారులో ఆమె వద్దకు చేరుకున్నారు. ఒక్కో మామిడి పండును రూ. 10 వేలకు కొంటానని చెప్పారు. ఆ మాట విన్న తులసి ఆశ్చర్యపోయింది. ఆమె తేరుకునే లోపలే 12 మామిడి పండ్లను రూ. 1.2 లక్షలకు కొనుగోలు చేసి... ఆమె తండ్రి బ్యాంకు ఖాతాకు వెంటనే డబ్బు బదిలీ చేశారు. దీంతో తులసి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. స్మార్ట్ ఫోన్ కొని, ఆన్ లైన్ తరగతులకు హాజరవుతోంది. మరోవైపు, హెటే చేసిన సాయాన్ని అందరూ అభినందిస్తున్నారు.