Kerala: పెళ్లికి నిరాకరించిన మహిళా పారిశ్రామికవేత్త.. గంజాయి కేసులో అరెస్ట్ చేయించిన ఆసుపత్రి సీఈవో
- పెళ్లికి నిరాకరించిందని ఇంట్లో గంజాయి పెట్టించిన వైనం
- కేసును క్రైం బ్రాంచ్‌కు అప్పగించిన సీఎం
- దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడి
తనతో పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో మహిళా పారిశ్రామిక వేత్తపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించాడో వ్యక్తి. కేరళలోని తిరువనంతపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రానికి చెందిన మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్ కు తిరువనంతపురంలోని లార్డ్స్ ఆసుపత్రి సీఈవో హరీశ్ హరిదాస్‌తో పరిచయమైంది. వారిద్దరి మధ్య స్నేహం పెరగడంతో హరీశ్ ఆమె వద్ద పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు.
అయితే, ఆ ప్రతిపాదనను నిరాకరించిన శోభ అప్పటినుంచి అతనిని దూరం పెట్టింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న హరీశ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు శోభ వద్ద పనిచేసే వివేక్‌రాజ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. వివేక్ సాయంతో శోభ ఇంటి లోపల హరీశ్ గంజాయి పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఆమెను అరెస్ట్ చేయించాడు.
అయితే, శోభ పారిశ్రామికవేత్త కావడంతో విషయం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీంతో కేసు దర్యాప్తును సీఎం క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. శోభను నిర్దోషిగా తేల్చిన పోలీసులు హరీశ్, వివేక్‌లను నిందితులుగా చేర్చారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డిప్యూటీ ఎస్పీ అమ్మినికుట్టన్ తెలిపారు.