Ram Nath Kovind: తన జీతం గురించి మాట్లాడిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... నెటిజన్ల కామెంట్లు!
- సాధారణ టీచర్ ఎక్కువగా పొదుపు చేస్తున్నాడు
- తన జీతంలోనూ కటింగులు ఉన్నాయన్న కోవింద్
- పెన్షన్ చట్టాన్ని గుర్తు చేస్తున్న నెటిజన్లు
"ఇండియాలోని ఉద్యోగుల్లో అత్యధికంగా వేతనం తీసుకునే వ్యక్తిని నేను. నాకు నెలకు రూ. 5 లక్షలు వస్తుంది. అందులో రూ. 3 లక్షల వరకూ పన్నులు, ఇతర కటింగులు ఉంటాయి. దీని ప్రకారం, నాకు మిగిలేది తక్కువే. నేను మిగతా వాళ్లతో పోలిస్తే బెటర్ కాదు. ఒక సాధారణ టీచర్ నాకన్నా ఎక్కువ పొదుపు చేస్తున్నాడు" అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడిన మాటల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, అంత పెద్ద హోదాలో ఉండి, వేతనం గురించి మాట్లాడటమేంటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరికొందరైతే, 1951 పెన్షన్ చట్టం ప్రకారం, రాష్ట్రపతికి అందే వేతనంపై పన్ను ఉండదని, ఆ విషయం కూడా తెలియకపోవడం విడ్డూరమని కామెంట్ చేస్తున్నారు. పదవీ విరమణ తరువాత ఆయనకు ఎన్నో ప్రయోజనాలుంటాయని, ఇతర అలవెన్స్ లు, సదుపాయాలను కూడా కల్పిస్తారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు ప్రథమ పౌరుడి వేతనంపైనా కటింగ్ ఉంటుందని అంటుండటం గమనార్హం.
ఇక చాలా మంది రాష్ట్రపతి వేతనం, దానిపై కోతలు, ఆ పన్నులను ఎక్కడ వాడతారన్న సమాచారాన్ని ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. రాష్ట్రపతి మాట్లాడిన మాటల వీడియోను మీరూ చూడవచ్చు.