lang: వియత్నాం యుద్ధ భయంతో 41 ఏళ్లుగా అడవిలోనే...!
- 1972లో వియత్నాం యుద్ధం
- అయినవాళ్లను కోల్పోయిన వ్యక్తి
- ఇద్దరు కొడుకులతో కలిసి అడవిలోకి పయనం
- జంతువుల మధ్యే జీవనం
- 2013లో ఓ గ్రామంలోకి రాక
అడవిలో జంతువుల మధ్య పెరిగే టార్జాన్ గురించి అందరికీ తెలిసిందే. వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి తన పిల్లలను అచ్చం టార్జాన్ల మాదిరే పెంచాడు. ఒకటి కాదు, రెండు కాదు... ఆ తండ్రి, ఇద్దరు కొడుకులు ఏకంగా 41 సంవత్సరాల పాటు అరణ్యంలోనే జీవించారు. 1972లో వియత్నాం యుద్ధం సందర్భంగా అయినవారిని కోల్పోవడంతో ఆ వ్యక్తి, తన ఇద్దరు కొడుకులతో సహా అడవిలోకి పారిపోయాడు. అప్పటినుంచి వారి మకాం దట్టమైన చెట్లు, జంతువుల మధ్యే. వేటాడుతూ పొట్టపోసుకునేవారు.
2013లో వీరిని గుర్తించి ఓ గ్రామంలోకి తీసుకువచ్చేంత వరకు ఆయన కొడుకులకు స్త్రీ గురించి గానీ, శృంగారం గురించి గానీ ఏమాత్రం తెలియదు. అసలు, స్త్రీ ఉంటుందని కూడా వారికి తెలియదు. వియత్నాం యుద్ధం ముగిసినా వారు మాత్రం అరణ్యంలోనే బతికారు. 2015 నుంచి అల్వారో సెరెజో అనే ఫొటోగ్రాఫర్ వీరిని గమనిస్తూ, ఇటీవలే వారి కథను బయటి ప్రపంచానికి వెల్లడించాడు.
మనుషులను చూస్తే చాలు... వాళ్లు ముగ్గురు దూరంగా పారిపోయేవాళ్లని సెరెజో వెల్లడించాడు. అంతేకాదు, ఆ ఇద్దరు కొడుకుల తండ్రి ఇప్పటికీ వియత్నాం యుద్ధం ముగియలేదనే భావిస్తున్నాడట. ఆ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన లాంగ్ పూర్తిగా అడివిలోనే పెరిగినట్టు చెప్పాలి. తనవాళ్లు ఎవరిని కొట్టమంటే వాళ్లని కొట్టడం తప్ప మంచి, చెడు అనేవి అతడికి అసలేమాత్రం తెలియదని సెరెజో పేర్కొన్నాడు. గత ఆరేళ్లుగా ఓ గ్రామంలో ఉంటున్న ఆ ముగ్గురు... ఇటీవలే అడవిలోని తమ ఆవాసానికి వెళ్లిపోయారట.