Maharashtra: మళ్లీ కఠిన ఆంక్షల దిశగా మహారాష్ట్ర.. లాక్ డౌన్ స్థాయి పెంపు!
- ‘డెల్టా ప్లస్’తో తొలి మరణం
- అప్రమత్తమైన ప్రభుత్వం
- అన్ని జిల్లాల్లో ‘లెవెల్ 3’ ఆంక్షలు
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
లాక్ డౌన్ ఆంక్షల నుంచి ఇటీవలే బయటకొచ్చిన మహారాష్ట్ర.. మళ్లీ కఠిన ఆంక్షల దిశగా సాగుతోంది. రాష్ట్రానికి ‘డెల్టా ప్లస్’ రకం కరోనా కలవరం పట్టుకుంది. నిన్న ఆ వేరియంట్ కు ఓ మహిళ చనిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అది మరింత విజృంభించకముందే ఆంక్షల స్థాయిని పెంచింది. అన్ని జిల్లాల్లోనూ ‘లెవెల్ 3’ ఆంక్షలను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతీ ఆదేశించారు.
వారం సగటు పాజిటివిటీ రేటు, అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకలతో సంబంధం లేకుండా ఆంక్షలను అమలు చేయాలని ఉత్తర్వులిచ్చారు. ‘‘జన్యు మార్పులతో రకరకాల కరోనాలు పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసే ప్రతిరక్షక స్పందన తగ్గిపోతోంది. కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోక ముందే అన్ని జిల్లాలూ లెవెల్ 3 ఆంక్షలను అమలు చేయాలి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని పాటించాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండు వారాల పాటు జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు (డీడీఎంఏ) పరిస్థితిని పర్యవేక్షిస్తారని, కేసులు నమోదయ్యే పద్ధతిని బట్టి ఆంక్షలను సడలిస్తామని తెలిపారు. ఒకవేళ ఆ రెండు వారాల్లో ఎప్పుడైనా సరే కేసులు పెరిగితే ఆలస్యం చేయకుండా ఆంక్షల స్థాయిని డీడీఎంఏ పెంచవచ్చని సూచించారు. అందుకు రెండు వారాల టార్గెట్ దాకా ఆగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా 70 శాతం మందికి కరోనా టీకాలు వేసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నం చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో సూచించారు.
ఆంక్షల్లో భాగంగా రెస్టారెంట్లు, జిమ్ లు, సెలూన్లు, స్పాలను 50 శాతం సామర్థ్యంతో సాయంత్రం 4 గంటల వరకే అనుమతిస్తారు. ప్రైవేటు ఆఫీసులూ 50 శాతం సిబ్బందితోనే తెరుచుకుంటాయి. పెళ్లిళ్లకు 50 మంది అతిథులు, అంత్యక్రియలకు 20 మందిని అనుమతిస్తారు.