Fake Currency: మలుపు తిరిగిన రంగురాళ్ల చోరీ కేసు.. జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో రూ. 18 కోట్ల విలువైన నకిలీ నోట్లు!

18 crores fake currency seize in astrologer muralikrishna house

  • తన ఇంట్లోని రంగురాళ్లు చోరీకి గురయ్యాయంటూ వారం రోజుల క్రితం ఫిర్యాదు
  • దర్యాప్తులో విస్తుపోయే విషయాల వెల్లడి
  • రూ. 18 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ. 6 లక్షల విలువైన నగదు స్వాధీనం
  • గతంలో హవాలా కేసులో అరెస్ట్
  • అనుచరుల ద్వారా ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో నకిలీ నోట్ల చలామణి

జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లోని రంగురాళ్లు, కొంత నగదు చోరీకి గురయ్యాయంటూ హైదరాబాద్‌లోని నాగోలుకు చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ వారం రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు.  

ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు నిందితులు విచారణలో వెల్లడించిన విషయాలు ఆశ్చర్యపరిచాయి. తాము చోరీ చేసిన నగదును నకిలీ నోట్లుగా గుర్తించి తగలబెట్టేశామని నిందితులు తెలిపారు. దీంతో నకిలీ నోట్లు ఎలా వచ్చాయని మురళీశర్మను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 18 కోట్ల విలువైన నకిలీ నోట్లు, రూ. 6 లక్షల విలువైన నగదు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.

హవాలా మనీ కేసులో మురళీకృష్ణపై గతంలో కేసు నమోదైందని, జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. టీవీ చానళ్లలో ప్రకటనల ద్వారా పలువురికి నకిలీ రంగురాళ్లు విక్రయించినట్టు గుర్తించారు. నలుగురు అనుచరుల ద్వారా ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో మురళీశర్మ నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

విశాఖపట్టణంలో కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన ట్రేడింగ్ కంపెనీలో రూ. 90 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు మురళీ కృష్ణ శర్మ  మల్కాజిగిరి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు నుంచి నగదు బదిలీ చేశారు. అయితే, బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో నగదు బదిలీని మధ్యలోనే నిలిపివేశారు. ఈ కేసులో అప్పట్లో మురళీశర్మతోపాటు నలుగురు బ్యాంకు అధికారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిలుపై విడుదలైన తర్వాత నాగోలులో ఉంటున్నాడు. మురళీ శర్మ చదివింది పదో తరగతే అయినా నకిలీ నోట్లు, రంగురాళ్ల మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తాడు.

  • Loading...

More Telugu News