Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ను ఇరకాటంలోకి నెట్టిన అంతర్జాతీయ జర్నలిస్టు

Imran Khan tried to avoid a question on Uighurs of China

  • చైనాలో ముస్లిం మైనారిటీలపై దమనకాండ
  • ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించిన జోనాథన్ స్వాన్
  • నాలుగ్గోడల మధ్య చర్చిస్తామన్న ఇమ్రాన్
  • అంతకుమించి సమాధానం చెప్పేందుకు నిరాకరణ

చైనాకు పాకిస్థాన్ ఎంత విధేయురాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇటీవల చైనా 15 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పాకిస్థాన్ కు అందించింది. ఇక అసలు విషయానికొస్తే... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాపై తమ విధేయతను ఎలా చాటుకున్నాడో చూడండి! చైనాలో ముస్లింలపై అణచివేతకు అక్కడి ప్రభుత్వమే పాల్పడుతోందని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా, సూటిగా సమాధానం చెప్పలేని ఇమ్రాన్ ఖాన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

ఆక్సియోస్ మీడియా సంస్థ (హెచ్ బీఓ అనుబంధ సంస్థ) పాత్రికేయుడు జోనాథన్ స్వాన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ఇంటర్వ్యూ చేశారు. "ప్రపంచ దేశాల్లో ఇస్లామ్ వ్యతిరేక కార్యకలాపాలు నడుస్తున్నాయంటూ మీరు గతంలో ఐసిస్ కు లేఖలు రాశారు కదా? మీ పక్కనే ఉన్న చైనాలో పది లక్షల మంది ఉయిగర్లు (ముస్లిం మైనారిటీలు) అక్కడి ప్రభుత్వం చెరలో ఉన్నారు. వాళ్ల సంతతి పెరగకుండా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించే వారిని శిక్షించడమే కాకుండా మసీదులను కూడా ధ్వంసం చేసింది. ఇన్ని ఆధారాలున్నా మీరు ఎందుకు చైనాను ఉపేక్షిస్తున్నారు?" అని జోనాథన్ స్వాన్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇమ్రాన్ ఖాన్ చాలా ఇబ్బందిపడ్డారు. ఈ అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరంలేదని, ఒకవేళ ఏదైనా విషయం ఉంటే తాము నాలుగ్గోడల మధ్య చర్చించుకుంటామని తెలిపారు. కష్టాల్లో తమకు అండగా నిలుస్తున్న చైనాతో ఎంతో అనుబంధం ఉందని చెప్పారే తప్ప, ఉయిగర్ల అంశంలో మాత్రం తన స్పందన దాటవేశారు.

స్వాన్ తన ప్రశ్నను మరోసారి ఉద్ఘాటించగా... ఈసారి ఇమ్రాన్ అతి తెలివి ప్రదర్శిస్తూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. లక్షల మంది కశ్మీరీలు భారత సైన్యం చెరలో ఉన్నారని, ఇంతకంటే తీవ్రమైన అంశం ఇంకేముంటుందని తన దుర్నీతి వెలిబుచ్చారు. అయితే స్వాన్ ఈసారి కూడా పట్టువదల్లేదు. చైనాలో ఉయిగర్ల అణచివేతపై ఆధారాలు ఉన్నాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ ఇమ్రాన్ పాతపాటే పాడారు! నాలుగ్గోడల మధ్యే చర్చించుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News