West Bengal: అమిత్ షాతో భేటీ అనంతరం మమత ప్రభుత్వంపై గవర్నర్ ధన్కర్ విమర్శలు
- 48 గంటల్లో అమిత్ షాతో రెండోసారి భేటీ అయిన ధన్కర్
- ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని గౌరవించాలని వ్యాఖ్య
- అధికారులు, పోలీసులు నిబంధనలను పాటించాలని సూచన
పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ గత మంగళవారం నుంచి ఢిల్లీలో మకాం వేశారు. 48 గంటల వ్యవధిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రెండోసారి భేటీ అయ్యారు. ఈరోజు అమిత్ షాతో భేటీ అయిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారులు, పోలీసులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్నంత హింస మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హింసను రాజేస్తోందని అన్నారు.
మమతా బెనర్జీతో పలు అంశాల్లో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అమిత్ షాతో ధన్కర్ భేటీ అయ్యారు. బెంగాల్ లో చెలరేగుతున్న హింసపై చర్చించారు. ఆయన ఢిల్లీకి వెళ్లక ముందే మమత ప్రభుత్వంపై ఒక నివేదికను కేంద్రానికి పంపించారు. తన ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ప్రహ్లాద్ జోషి, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదురిలను ధన్కర్ కలిశారు.