Milkha Singh: మిల్కాసింగ్ ఇక లేరు.. కరోనా అనంతర సమస్యలతో కన్నుమూసిన దిగ్గజ స్ప్రింటర్

Milkha Singh no more

  • మూడు రోజుల క్రితం కొవిడ్ వార్డు నుంచి నాన్ కొవిడ్ ఐసీయూ వార్డుకు తరలింపు
  • అంతలోనే పరిస్థితి విషమించి కన్నుమూత
  • పరుగు పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో ఎగరేసిన మిల్కాసింగ్
  • కరోనాతో ఈ నెల 13న ఆయన భార్య నిర్మల్ సైనీ కౌర్ కన్నుమూత
  • రాష్ట్రపతి, ప్రధాని, పంజాబ్ సీఎం సంతాపం

భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన ఆయన కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

కరోనాతో బాధపడుతూ మే 20న ఆసుపత్రిలో చేరిన మిల్కాసింగ్‌కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్కా సింగ్ ధ్రువీకరించారు. కాగా, మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈ నెల 13న మృతి చెందారు.

20 నవంబరు 1932లో నేటి పాకిస్థాన్ లోని పంజాబ్‌లోని గోవింద్‌పుర‌లో మిల్కాసింగ్ జన్మించారు. పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.

మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తదితరులు సంతాపం తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News