Nara Lokesh: జగన్ సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజరూపాన్ని బయటపెడుతున్నారు: నారా లోకేశ్
![Jagan exposing his factionist mentality says Nara Lokesh](https://imgd.ap7am.com/thumbnail/cr-20210617tn60cae8c5989c4.jpg)
- కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య
- కారుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
- ఈ హత్యలు జగన్ నెత్తుటి దాహానికి సాక్ష్యమన్న లోకేశ్
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సోదరులు వడ్డి నాగేశ్వర్ రెడ్డి, వడ్డి ప్రతాప్ రెడ్డిలను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. ఈ ఫ్యాక్షన్ హత్యలతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. జగన్ సీఎం ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్ట్ నిజరూపాన్ని బయటపెడుతున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ గ్యాంగులు వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లకు పదునుపెట్టి పల్లెల్లో ప్రతీకారాలకు దిగుతున్నాయని అన్నారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలు చెలరేగిపోతున్నాయని లోకేశ్ దుయ్యబట్టారు.
పాణ్యం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి, ప్రతాప్ రెడ్డిలను కారుతో ఢీకొట్టిన ఫ్యాక్షన్ లీడర్లు వేటకొడవళ్లతో నరికి చంపేయడం అత్యంత దారుణమని అన్నారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతులు, బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దారుణ మరణాలు జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతల నెత్తుటి దాహానికి సాక్ష్యమని అన్నారు.
ఫ్యాక్షన్ ముఠాలు ఆ ఫ్యాక్షన్ కే అంతమవుతాయని లోకేశ్ అన్నారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి నెలకొల్పడానికి, స్నేహపూర్వక వాతావరణం కల్పించడానికి టీడీపీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని చెప్పారు.