East Godavari District: పుట్టిన రోజు వేడుకల్లో కత్తులతో వీరంగమేసిన యువకులు.. ముమ్మిడివరంలో ఘటన
- మాజీ కౌన్సిలర్ కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో ఘటన
- పోలీస్ స్టేషన్ ఎదురుగానే కత్తులతో బర్త్ డే సెలబ్రేషన్స్
- కత్తులు తిప్పుతూ, కేకలు వేస్తూ ర్యాలీ
- విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు
పుట్టిన రోజు వేడుకల్లో కొందరు యువకులు కత్తులతో వీరంగమేసి భయోత్పాతం సృష్టించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. మాజీ కౌన్సిలర్ కుమారుడైన యల్లమిల్లి దుర్గాప్రసాద్ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాత్రి స్థానిక విష్ణాలయం సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకలకు కొందరు యువకులు కత్తులతో హాజరయ్యారు. ఓ కత్తిని దుర్గాప్రసాద్ చేతికి ఇచ్చి దానితో కేక్ కట్ చేయించారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై కత్తులు తిప్పుతూ, కేకలు వేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అంతేకాదు, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ కారుపై కేకును ఉంచి దుర్గాప్రసాద్‌తో కత్తితో కోయించి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా మళ్లీ విష్ణాలయం సెంటర్‌కు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లి యువకులను చెదరగొట్టారు. కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగానే కత్తులతో యువకులు పుట్టిన రోజు చేసుకోవడం విమర్శలకు తావివ్వడంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.