Botsa Satyanarayana: సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే పన్ను సవరింపు: బొత్స
- ఏపీలో ఆస్తి పన్ను సవరింపు
- విపక్షాల విమర్శలు
- ప్రజలపై భారం పడదని బొత్స స్పష్టీకరణ
- గతంలో లోపభూయిష్ట విధానం ఉండేదని ఆరోపణ
ఏపీలో ఆస్తి పన్ను అంశంపై విపక్షాలు విమర్శలు చేస్తుండడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే పన్ను సవరించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పన్ను విధానాన్ని కూడా పరిశీలించామని, ఇంటి పన్ను ఏ ఒక్కరికీ భారం కాకూడదన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలపై భారం పడని రీతిలో పన్ను సవరింపులు చేపట్టామని స్పష్టం చేశారు.
గతంలో ఆస్తిపన్నుపై లోపభూయిష్టమైన విధానం ఉండేదని వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని ఉద్ఘాటించారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో ఇంటి పన్నులు కడుతున్న నివాసాలు మొత్తం 33,67,000 అని బొత్స వెల్లడించారు. వాటి ద్వారా రూ.1242 కోట్లు ఇంటి పన్ను రూపేణా వస్తోందని వివరించారు. ఈ ప్రాతిపదికన 15 శాతం పెంచడం వల్ల రూ.1428 కోట్లు వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 375 చదరపు అడుగులు ఉన్న ఇంటికి రూ.50 మాత్రమే ఇంటి పన్ను అని వెల్లడించారు. ఇది సీఎం ఆదేశం అని పేర్కొన్నారు. ఇంతకుమించి భారం పెరగదని, దీనిపై టీడీపీతో సుద్దులు చెప్పించుకునే స్థితిలో తాము లేమని బొత్స వ్యాఖ్యానించారు.