Chandra Shekhar: నాటి 'రామాయణ్' సీరియల్ లో నటించిన ప్రముఖ నటుడు చంద్రశేఖర్ మృతి

Ramayan actor Chandra Shekhar no more
  • 250కి పైగా సినిమాల్లో నటించిన చంద్రశేఖర్
  • ఆయన వయసు 98 సంవత్సరాలు
  • హైదరాబాదులోనే జన్మించిన చంద్రశేఖర్
'రామాయణ్' సీరియల్ యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆదివారం ఉదయం సీరియల్ ప్రారంభమయ్యే సమయానికి అందరూ టీవీల ముందు అతుక్కుపోయేవారు. ఆ సీరియల్ లో 'ఆర్య సుమంత్' పాత్రను పోషించిన సీనియర్ నటుడు చంద్రశేఖర్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఈరోజు ఉదయం 7 గంటలకు ముంబైలోని నివాసంలో మృతి చెందినట్టు ఆయన కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు.

కుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే నిద్రలోనే ఆయన కన్నుమూశారని అశోక్ తెలిపారు. ఇలాంటి సుఖమైన మరణాన్నే ఆయన కోరుకున్నారని చెప్పారు. నాన్నకు ఎలాంటి అనారోగ్యం లేదని... బతికినన్నాళ్లు ఆరోగ్యంగా బతికారని తెలిపారు. ముంబై జుహులోని హాన్స్ క్రెమటోరియంలో ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి.

కాగా, చంద్రశేఖర్ హైదరాబాదులో జన్మించారు. 1950లలో జూనియర్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. 250కి పైగా సినిమాలలో ఆయన నటించారు. 1964లో సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి, డైరెక్టర్ గా కూడా మారారు. హెలెన్ తొలిసారి లీడ్ రోల్ పోషించిన 'చా చా చా' సినిమాను ఆయనే నిర్మించారు. చంద్రశేఖర్ కు ముగ్గురు సంతానం ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Chandra Shekhar
Ramayan Serial
Dead
Bollywood

More Telugu News