Mithun Chakraborty: పుట్టినరోజు నాడు పోలీసుల విచారణను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి
- బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన మిథున్
- మోదీ సమక్షంలో వైరిపక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కోల్ కతా పోలీసులు
'డిస్కో డ్యాన్సర్' సినిమాతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ వెటరన్ స్టార్ మిథున్ చక్రవర్తి... ఆ తర్వాత పాప్యులర్ హీరోగా కొనసాగారు. ఇప్పటికీ 71 ఏళ్ల మిథున్ అంటే సినీ ప్రేక్షకులకు అమితమైన అభిమానం ఉంది. పశ్చిమబెంగాల్ కు చెందిన మిథున్ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తూ... తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై కోల్ కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వర్చువల్ విధానం ద్వారా ఆయనను ఈరోజు విచారించారు. ఈ రోజు మిథున్ పుట్టినరోజు కావడం గమనార్హం.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఆయన ప్రసంగిస్తూ... అధికార టీఎంసీ పార్టీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. 'ఇక్కడ నేను కొడితే... వాళ్ల శరీరాలు శ్మశానంలో పడతాయి' అని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 7వ తేదీన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆ సభలోనే మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మోదీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.