Varla Ramaiah: ముఖ్యమంత్రి గారికి నేరచరిత గలవారి పట్ల ఎంతో మక్కువ: వర్ల వ్యంగ్యం

Varla Ramaiah comments on nominated MLC matter

  • నామినేటెడ్ ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం
  • సతీసమేతంగా గవర్నర్ ను కలిసిన సీఎం జగన్
  • గవర్నర్ కు కృతజ్ఞతలు
  • సీఎం చుట్టూ నేరచరితులేనంటూ వర్ల విమర్శలు

నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నలుగురిలో ముగ్గురికి క్రిమినల్ రికార్డు ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపిస్తుండడం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ కూడా రాశారు. వర్ల తాజాగా ట్విట్టర్ లోనూ స్పందించారు.

ముఖ్యమంత్రి గారికి నేరచరిత గలవారి పట్ల మక్కువ ఎక్కువ అని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రమంతా ఎరిగిన ఇద్దరు నేరచరితులను ఎమ్మెల్సీలుగా చేయడం కోసం సాక్షాత్తు సతీసమేతంగా గవర్నర్ వద్దకు వెళ్లారని వెల్లడించారు. ఇప్పటికే మంత్రిమండలిలోనూ, శాసనసభలోనూ, పార్లమెంటు సభ్యులుగానూ, చైర్మన్లుగా ఆయన చుట్టూ ఎంతోమంది నేరచరితులు ఉన్నారని అన్నారు.

ఏపీ ప్రభుత్వం తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మోషేన్ రాజుల పేర్లను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా గవర్నర్ కు సిఫారసు చేయగా.... గవర్నర్ నిన్న ఆమోద ముద్ర వేయడం తెలిసిందే. సీఎం జగన్ సతీసమేతంగా వెళ్లి గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Varla Ramaiah
Nominated MLCs
Jagan
Governor
YSRCP
  • Loading...

More Telugu News