Tamilnadu: అన్నా డీఎంకేకు పూర్వ వైభవం తెస్తా: మద్దతుదారులకు శశికళ హామీ
- ఆందోళన చెందవద్దని భరోసా
- పార్టీ నేతతో ఫోన్ సంభాషణ
- బయటకు లీకైన ఆడియో క్లిప్
- నిన్ననే 16 మందిపై పార్టీ వేటు
అన్నాడీఎంకేకు పూర్వ వైభవం తెస్తానని ఆ పార్టీ మాజీ అధినేత్రి, చిన్నమ్మ శశికళ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని తన మద్దతుదారులకు భరోసానిచ్చారు. శశికళతో మాట్లాడుతున్నారన్న కారణంగా 16 మంది నేతలపై పార్టీ అధిష్ఠానం వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే వారితో శశికళ మాట్లాడారు.
గుబేంద్రన్ అనే పార్టీ నేతతో శశికళ ఫోన్ లో మాట్లాడారు. ఆ సంభాషణకు చెందిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. తననెవరూ ఆపలేరని, పార్టీకి పునర్వైభవం తీసుకొస్తానని ఆయనకు చెప్పారు. పార్టీ మొత్తాన్ని కేవలం మాజీ సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకే ఎందుకు అప్పగించారని గుబేంద్రన్ ప్రశ్నించగా.. తాను కేవలం కార్యకర్తలకే పార్టీని అప్పగించానని ఆమె బదులిచ్చారు. ఒకప్పుడు కార్యకర్తల బలంతోనే కదా పార్టీ వైభవోపేతంగా సాగింది అని చెప్పారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అయితే, మళ్లీ పార్టీని గుప్పిట్లో పెట్టుకునేందుకే రాజకీయ పున:ప్రవేశం చేస్తానంటూ శశికళ ప్రకటనలు చేస్తున్నారని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిన్న సంయుక్త ప్రకటన చేశారు. ఆమెతో ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.