Delta Variant: డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. కొవిషీల్డ్ టీకా వ్యవధిని 8 వారాలకు తగ్గించాలంటున్న డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి
- తొలి డోసుతో లభించేది 33 శాతం రక్షణ మాత్రమే
- పలు దేశాలు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాయి
- భారత్‌లోనూ తగ్గించడం మేలంటున్న డా.శ్రీనాథ్
దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణకు డెల్టా వేరియంటే కారణమన్న నేపథ్యంలో కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ కె.శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్ కారణంగా బ్రిటన్‌లోనూ టీకా వ్యవధిని తగ్గించారని ఆయన గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్ విధానంలో మార్పులు చేయాలని సూచించారు.
కొవిషీల్డ్ తొలి డోసుతో 33 శాతం మాత్రమే రక్షణ ఉంటుందని, కాబట్టి రెండో డోసును త్వరగా వేయడం ద్వారా పూర్తి రక్షణ కల్పించవచ్చని అన్నారు. డెల్టా వేరియంట్‌పై తొలిడోసుతో లభించేది 33 శాతం రక్షణ మాత్రమేనని బ్రిటన్ అనుభవం చెబుతోందని, కాబ్టటి రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించాల్సిన అవసరం ఉందని డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అధ్యయనాలు కూడా రెండో డోసు తీసుకుంటేనే రక్షణ ఉంటుందని చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మిగిలిన దేశాల్లోనూ రెండు డోసుల మధ్య దూరాన్ని 8 వారాలకు తగ్గించారని అన్నారు. భారత్‌లోనూ డెల్టా వేరియంట్ తీవ్రంగా ఉండడంతో అదే మేలని అన్నారు.