China: చైనా బీఆర్‌ఐకి 'బీ3డబ్ల్యూ'తో చెక్‌ పెట్టనున్న జి-7!

G7 Countries proposes B3W project to check the chinas BRI

  • తాజాగా జరుగుతున్న జి-7 సమావేశాల్లో ప్రతిపాదన
  • బీఆర్‌ఐ పేరిట దేశాలను రుణ ఊబిలోకి లాగుతున్న డ్రాగన్‌
  • చెక్‌ పెట్టేందుకు సిద్ధమైన జి-7
  • 40 ట్రిలియన్‌ డాలర్లతో పేద-మధ్యాదాయ దేశాల్లో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు

‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌-బీఆర్‌ఐ’ పేరిట పేద మధ్యాదాయ దేశాలను రుణ ఊబిలోకి లాగుతున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు జి-7 ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ‘బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌(బి3డబ్ల్యూ)’ పేరిట అంతర్జాతీయ స్థాయిలో భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టును చేపట్టాలని సభ్యదేశాలు ప్రతిపాదించాయి.

అమెరికా స్ఫూర్తితో తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనపై ‘‘చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక పోటీ.. పేద, మధ్యాదాయ దేశాల్లో అవసరమైన భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుకు నిర్మాణాత్మక చర్యలు’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో కూటమి సభ్య దేశాల అధినేతలు చర్చించినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

బీఆర్‌ఐ పేరిట చైనా చేపట్టిన భారీ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ ముసుగులో చైనా ఆయా దేశాలను రుణ ఊబిలోకి లాగి తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని కొన్ని కీలక దేశాలు ఆరోపిస్తున్నాయి. తద్వారా డ్రాగన్‌ దేశం ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు యత్నిస్తోందని వాదిస్తున్నాయి.

చైనా కుయుక్తులకు చెక్‌ పెట్టడానికే జి-7 బి3డబ్ల్యూ ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నట్లు శ్వేతసౌధం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు కింద పేద, మధ్యాదాయ దేశాల్లో కరోనా సంక్షోభం మూలంగా వెనుకబడిన అత్యవసరమైన 40 ట్రిలియన్‌ డాలర్లు విలువ చేసే భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు తెలిపింది. దీని విలువ ఆధారిత, అత్యున్నత ప్రమాణాలు, పారదర్శకంగా చేపట్టనున్నట్లు వివరించింది. దీనిపై మరిన్ని వివరాలు రేపు జరగబోయే సదస్సులో వెల్లడించనున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News