gst: జీఎస్‌టీ మండలి సమావేశం ప్రారంభం.. పాల్గొన్న హరీశ్ రావు
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భేటీ
- కొవిడ్, బ్లాక్ ఫంగస్ మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే చాన్స్
- ఇప్పటికే నివేదిక అందించిన మంత్రుల బృందం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి 44వ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరుగుతోంది. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. కొవిడ్, బ్లాక్ ఫంగస్ మందులు, పరికరాలపై పన్నుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న నేపథ్యంలో వాటిపై జీఎస్టీని భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం సమావేశంలోనూ ఈ విషయమై చర్చించినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దానిపై అధ్యయనం చేయడానికి నియమించిన మంత్రుల బృందం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర ఆర్థిక శాఖకు అందజేసింది.