United Nations: పదేళ్లలో కొత్తగా ఒక్క ఎయిడ్స్ కేసూ రానివ్వం: కేంద్ర ఆరోగ్యమంత్రి
- హెచ్ఐవీని అంతం చేస్తామన్న హర్షవర్ధన్
- లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని వెల్లడి
- ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల్లో ప్రసంగం
పదేళ్లలో హెచ్ఐవీ ఎయిడ్స్ ను అంతం చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యమని, ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా చూసేందుకు లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ రోజు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 75వ అత్యున్నత సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు.
తమ లక్ష్యానికి ఇంకా 115 నెలల సమయమే ఉందన్న సంగతి తెలుసని, దానిని అందుకునేందుకు వీలుగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎయిడ్స్ మహమ్మారిని పారదోలే క్రమంలో మున్ముందు ఎదురయ్యే సవాళ్లు, గ్యాప్ లను బేరీజు వేసుకుంటామన్నారు. ఎయిడ్స్ అంతానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని, దానికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటామని ఆయన తెలిపారు.
హెచ్ఐవీ ఎయిడ్స్ నివారణకు పౌర సమాజం సహకారంతో ‘టార్గెటెడ్ ఇంటర్ వెన్షన్స్ ప్రోగ్రామ్’ను అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా హెచ్ఐవీ పరీక్షలు, హెచ్ఐవీ ఉన్న వారికి చికిత్సలు, ప్రవర్తనల్లో మార్పుల వంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 14 లక్షల మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆఫ్రికాలో హెచ్ఐవీ సోకిన వారికీ మందులను పంపిస్తున్నామన్నారు.