Jagan: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారన్న సీఎం జగన్
- కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చ
- వయబిలిటి గ్యాప్ ఫండ్ విషయంపై కీలక నిర్ణయం
- రాష్ట్రంపై భారం పడకుండా చూడాలని జగన్ వినతి
- సమావేశం ఏర్పాటుకు ఓకే చెప్పిన ధర్మేంద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఈ రోజు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆయన చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యామ్నాయాలను వివరించారు.
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా కోరారు. అలాగే, వయబిలిటి గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై భారం పడకుండా చూడాలని తాను ధర్మేంద్ర ప్రధాన్‌కు చెప్పినట్లు సీఎం వివరించారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, వచ్చే వారం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పెట్రోలియం శాఖ కార్యదర్శులతో ఈ సమావేశం ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో చర్చలు జరిపిన అనంతరం ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారని తెలిపారు. కాగా, ధర్మేంద్ర ప్రధాన్‌తో సమావేశం అనంతరం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో జగన్ భేటీ అయ్యారు.