Uttar Pradesh: అమిత్‌ షాతో భేటీ అయిన ఆదిత్యనాథ్‌.. రేపు మోదీతో!

Up cm met with shah will meet PM Tomorrow
  • యూపీ బీజేపీలో విభేదాలు
  • నాయకత్వ మార్పు అంటూ ఊహాగానాలు
  • మరోవైపు జితిన్‌ ప్రసాద పార్టీలో చేరిక
  • ఈ తరుణంలో ఆదిత్యనాథ్‌ ఢిల్లీ పర్యటన
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. రేపు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. యూపీ బీజేపీలో లుకలుకలు ప్రారంభమైన తర్వాత ఆదిత్యనాథ్‌ తొలిసారి అధిష్ఠానంతో భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

యూపీలో బీజేపీ నాయకులు కొంతమంది ముఖ్యమంత్రి వ్యవహారంతో అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ కట్టడి విషయంలో ఆదిత్యనాథ్‌ సరిగా వ్యవహరించలేదన్న అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్నట్లు సమాచారం.

ఇది వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడనుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారు పార్టీ అధిష్ఠానం దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ పెద్దలు యూపీలో నాయకత్వాన్ని మార్చనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఆదిత్యనాథ్‌ పర్యటన జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నేడు అమిత్‌ షాతో యోగి 90 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మరోవైపు నిన్ననే కాంగ్రెస్‌ పార్టీ నుంచి కీలక నేత, రాష్ట్రంలో శక్తిమంతమైన బ్రాహ్మణ వర్గానికి చెందిన జితిన్‌ ప్రసాద బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆదిత్యనాథ్‌ ఢిల్లీకి వెళ్లడం కూడా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.  

అయితే ఆదిత్యనాథ్‌ను మార్చే అవకాశం లేదని బీజేపీ ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది. కానీ, ఇతర కీలక నేతల స్థానాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Uttar Pradesh
Narendra Modi
Yogi Adityanath
Amit Shah
BJP

More Telugu News