Botsa Satyanarayana: ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం: మంత్రి బొత్స

Botsa clarifies on Visakha capital issue
  • మూడురాజధానులపై మరో ఆలోచన లేదన్న బొత్స
  • దుష్టశక్తులు కోర్టులకు వెళ్లాయని వెల్లడి
  • న్యాయప్రక్రియ కొనసాగుతోందని వివరణ
  • బిల్లు తెచ్చినప్పుడే రాజధాని ప్రక్రియ ప్రారంభమైందన్న బొత్స
విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ షురూ అయిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో, ఎక్కడ్నించైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమైందని పేర్కొన్నారు.

ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపైనా బొత్స స్పందించారు. సీఎం జగన్ పర్యటనపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. జగన్ కు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ దొరికితే ఒకలా, దొరక్కపోతే ఒకలా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిస్తే టీడీపీ నేతలకు అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకే జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారని బొత్స స్పష్టం చేశారు.

"జగన్ ఢిల్లీ వెళితే ఏదో ఒక విమర్శ చేయడం టీడీపీ పని. వీలైతే సీఎంకు సూచనలు, సలహాలు ఇవ్వండి" అంటూ హితవు పలికారు.
Botsa Satyanarayana
Visakhapatnam
AP Capital
Three Capitals
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News