Maharashtra: గెడ్డం గీసుకోవాలంటూ ప్రధాని మోదీకి వంద రూపాయలు పంపిన టీస్టాల్ యజమాని!
- మోదీకి లేఖ రాసిన మహారాష్ట్ర టీస్టాల్ యజమాని
- ఇక మోదీ పెంచేది ఏదైనా దేశ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సూచన
- మోదీని అవమానించడం తన ఉద్దేశం కాదన్న మోరే
- మోదీ అంటే తనకెంతో ఇష్టమన్న టీస్టాల్ యజమాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గడ్డం పెంచుతూ పోతున్నారని, ఇకపై ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలంటూ మహారాష్ట్రకు చెందిన ఓ టీస్టాల్ యజమాని మోదీకి లేఖ రాస్తూ తన నిరసనను వ్యక్తం చేశాడు. అంతేకాదు, వెంటనే గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు కూడా పంపాడు. కరోనా కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన పేరు అనిల్ మోరే. బారామతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు.
ప్రధాని మోదీ గడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని అనిల్ మోరే కోరాడు. లాక్‌డౌన్‌ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్న మోరే.. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు.
మోదీని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని పేర్కొన్నాడు. మహమ్మారి కారణంగా దేశ ప్రజలు, పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు మోరే వివరించాడు.