Byson: అడవిదున్నకు కొమురం భీం పేరు... విమర్శలతో వెనక్కి తగ్గిన జూ అధికారులు
- హైదరాబాదు జూలో జన్మించిన అడవిదున్న
- గిరిజన వీరుడి పేరుపెట్టిన అధికారులు
- ఆదివాసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
- అసంతృప్తి వ్యక్తం చేసిన కొమురం భీం అభిమానులు
ఇటీవల హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ అడవిదున్న జన్మించింది. దానికి అధికారులు కొమురం భీం అంటూ గిరిజన వీరుడి పేరుపెట్టడం విమర్శలకు దారితీసింది. దున్నపిల్లకు కొమురం భీం పేరుపెట్టడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ పేరును వెనక్కి తీసుకోవాల్సిందిగా జూ అధికారులను డిమాండ్ చేశాయి. కొమురం భీం అభిమానులు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జూ అధికారులు వెనక్కి తగ్గారు. ఆ అడవిదున్నకు ఆ పేరును తొలగించారు. జూలో ఇటీవల ఓ ఖడ్గమృగం పిల్ల జన్మించగా, అధికారులు దానికి నంద అనే పేరుపెట్టారు. కానీ అడవిదున్న పిల్ల పేరుపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.