Vijayashanti: అసలు మీకు వ్యాక్సిన్ అంటే తెలుసా?... మంత్రి కేటీఆర్ కు విజయశాంతి ప్రశ్న

Vijayasanthi slams KTR over corona vaccine issue

  • వ్యాక్సినేషన్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం
  • వివేకం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు
  • కేంద్రంపై నిందలు మోపుతున్నారని వెల్లడి
  • సోషల్ మీడియాలో విజయశాంతి సుదీర్ఘ వివరణ

కరోనా వ్యాక్సిన్ల అంశంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్ గారూ... మీకు అసలు వ్యాక్సిన్ అంటే ఏంటో తెలుసా? వ్యాక్సిన్ ఉత్పత్తి ఎలా జరుగుతుందో కొంచెమైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో విజయశాంతి సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.

"వ్యాక్సిన్ అనేది గంటలోనో, ఒక రోజులోనూ ఉత్పత్తి చేసి, ఇప్పటికిప్పుడు ఇబ్బడిముబ్బడిగా తయారుచేసేది కాదు... అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. సాధారణంగా వ్యాక్సిన్ల తయారీకి ఏళ్ల సమయం పడుతుంది. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సాహంతో మన శాస్త్రజ్ఞులు అతి తక్కువ సమయంలోనే టీకాలు అభివృద్ధి చేశారు. తద్వారా భారత్ పాటవం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది. ఓవైపు ఇంత జరిగితే... ఇంకా కేంద్రానికి ప్లాన్ లేదు, విజన్ లేదు అంటూ మాట్లాడుతున్న కేటీఆర్ గారికే సరైన విజ్ఞత లేదని అర్థమవుతోంది.

ప్రపంచంలో గత డిసెంబరులో వ్యాక్సినేషన్ మొదలైతే, భారత్ లో జనవరి 16న వ్యాక్సినేషన్ షురూ చేశారు. ఇప్పటివరకు 25 కోట్లకు పైగా టీకా డోసులు అందించారు. ఇది అమెరికాలో చేపట్టిన వ్యాక్సినేషన్ కంటే ఎక్కువ. ఈ ఏడాది డిసెంబరు నాటికి 250 కోట్ల టీకా డోసుల సమీకరణకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. కానీ, వ్యాక్సిన్ పంపిణీపై టీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయకుండా, విదేశాలకు టీకాలు అమ్ముకుంటున్నారంటూ కేంద్రంపై నిందలు మోపుతున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకోవడం పట్ల మీరు ఓర్వలేకపోతున్నారు.

డబ్ల్యూహెచ్ఓ, ఐరాస, ఉత్పత్తి సంస్థల నిబంధనల ప్రకారం.... కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేయాల్సిందే. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా? మీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు మోపుతారా? కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ఉంది. కానీ మీరు అజ్ఞానంతో తెలంగాణ ఒక్కదాంట్లోనే వ్యాక్సినేషన్ చేస్తామంటే అంతకంటే అజ్ఞానం ఉండదు. ప్రపంచం మొత్తం వ్యాక్సినేషన్ జరిగినప్పుడు కరోనా నిర్మూలన సాధ్యమవుతుంది. మీరు వ్యాక్సినేషన్ చేయించినా, చేయించకపోయినా మోదీ సర్కారు దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తుంది.

కేటీఆర్ గారూ... ఇంకో విషయం గుర్తుంచుకోండి... తెలంగాణ రాష్ట్రం ఉన్నది భారతదేశంలోనే. ఫైజర్ వంటి సంస్థలు వ్యాక్సిన్ కోసం అధిక ధర డిమాండ్ చేస్తే... భారత్ స్వావలంబనతో వేగవంతంగా వ్యాక్సినేషన్ చేపట్టింది. ఫైజర్ ఒక్కో డోసుకు రూ.2,880 అడిగింది. ఆ లెక్కన దేశ జనాభా కోసం రూ.7 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ అంశంపై కేటీఆర్ కు కొంచెమైనా వివేకం ఉందా? ఇప్పటికీ ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలను భారత్ కు ఎందుకు తీసుకురావడంలేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఒక టీకా డోసు రూ.250కే అందుబాటులో ఉండకూడదనా? మీ ఇష్టం వచ్చినట్టు రూ.2 వేలు, 3 వేలు అంటూ రేట్లు పెంచి కమీషన్లు దండుకోవాలనా?

అసలు కరోనా కట్టడి కోసం టీఆర్ఎస్ సర్కారు చేసిందేమిటి? టెస్టులు తక్కువ చేసి, కేసులు, మృతుల సంఖ్యను తక్కువగా చూపింది. ఆసుపత్రుల్లో సిబ్బంది లేరు, వసతులు లోపించాయి... తత్ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు సరైన సేవలు అందించలేకపోయాయి. టీఆర్ఎస్ నేతల ప్రోద్బలంతో ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల దోపిడీ దందా కొనసాగింది. నిర్వహణలో విఫలం కావడతో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ వృథా అయింది. మొత్తమ్మీద కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. దీని నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ వ్యాక్సినేషన్ పై కేంద్రం మీద నిందలు వేస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. భవిష్యత్తులో మీ పతనానికి మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని తెలుసుకోండి" అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News