Southwest Monsoon: నైరుతి రుతుపవనాలపై అప్ డేట్ ఇదిగో!
- ఈ నెల 3న కేరళను తాకిన రుతుపవనాలు
- కొన్ని రోజుల వ్యవధిలోనే విస్తరించిన వైనం
- కర్ణాటక, తమిళనాడుల్లో పూర్తిగా వ్యాపించిన రుతుపవనాలు
- ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ప్రభావం
ఈ నెల 3న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే మరింతగా విస్తరించాయి. ప్రస్తుతం ఇవి తమిళనాడు, కర్ణాటక అంతటా వ్యాపించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే మూడ్రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
అటు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. అటు హిమాలయ పర్వత శ్రేణి వరకు వ్యాపించినట్టు ఐఎండీ పేర్కొంది. ఇక మహారాష్ట్రలోని పుణేకు రుతుపవనాలు చేరుకున్నాయని వెల్లడించింది. పుణే నగరానికి సాధారణంగా జూన్ 10న చేరుకుంటాయని, కానీ ఈసారి నాలుగు రోజులు ముందుగానే వచ్చాయని వివరించింది. రుతుపవనాల ఆగమనంతో పుణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.