Nara Lokesh: కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారు... కుదరకపోయే సరికి కూల్చేశారు: నారా లోకేశ్
- విశాఖలో మానసిక దివ్యాంగుల స్కూలు కూల్చివేత
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్
- కన్నుపడితే కబ్జాలేనంటూ విమర్శలు
- వైసీపీ నేతల పాపం పండే రోజు దగ్గరపడిందని వ్యాఖ్యలు
విశాఖలోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేత అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణం అనధికారికంగా విజయసాయిరెడ్డి పట్టణం అయిపోయిందని విమర్శించారు. కన్ను పడితే కబ్జా, ఖాళీ చేయకపోతే జేసీబీలతో విధ్వంసం అని మండిపడ్డారు.
పెదవాల్తేరులో వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న 190 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్న హిడెన్ స్ప్రౌట్స్ పాఠశాలను ఏ2 రెడ్డి గ్యాంగులు కబడ్డీ పేరుతో కబ్జా చేయాలని చూశారని, సాధ్యం కాకపోయే సరికి రాజారెడ్డి రాజ్యాంగానికి అనువైన శనివారం రోజే జేసీబీలతో కూల్చివేశారని లోకేశ్ ఆరోపించారు. మానసిక దివ్యాంగులకు నీడనిచ్చే పాఠశాలకు సాయం చేయాల్సింది పోయి, ఆక్రమించిన వైసీపీ నాయకుల పాపాలు పండే రోజు దగ్గరికొచ్చిందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఓ పత్రికలో ఇదే అంశంపై వచ్చిన కథనాన్ని కూడా లోకేశ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. పాఠశాల స్థలంపై అధికార పక్ష నేత కన్ను పడిందని, ఆటలకు ఇవ్వాలని నిర్వాహకుడ్ని హెచ్చరించారని ఆ కథనంలో పేర్కొన్నారు. దాతల సాయం, కేంద్రం ఇచ్చే నిధులపై నడుస్తున్న ఆ మానసిక దివ్యాంగుల పాఠశాలను 'లీజు' సాకుతో కూల్చివేశారని ఆ కథనంలో వివరించారు.