Perike Varaprasad Rao: తక్షణమే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: దళిత్ క్రిస్టియన్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు వరప్రసాద్ రావు
- రఘురామపై ధ్వజమెత్తిన దళిత నేత
- దళిత ఐఏఎస్, ఐపీఎస్ లపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం
- అరెస్టయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని విమర్శలు
- డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
ఇండియన్ దళిత్ క్రిస్టియన్ రైట్స్ సంస్థ జాతీయ అధ్యక్షుడు పెరికె వరప్రసాద్ రావు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రఘురామకృష్ణరాజు దళిత ఐఏఎస్, ఐపీఎస్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వరప్రసాద్ రావు అన్నారు. రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రఘురామకృష్ణరాజు అరెస్టయినా గానీ ఇంకా సిగ్గు లేకుండా వీడియోలు, ఆడియోలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా పెరికె వరప్రసాద్ రావు ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. "రాష్ట్రంలో కొవిడ్ సంక్షోభం నెలకొన్న తరుణంలో నిధుల్లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు మేలు చేస్తున్నారు. పాస్టర్లకు, పేద పాస్టర్లకు రూ.5 వేలు గౌరవవేతనం అందిస్తున్నారు. అందుకే వచ్చే ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చర్చిల్లో వైఎస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిస్తున్నా" అని వివరించారు.