Corona Virus: పిల్లలపై ప్రారంభమైన జైడస్, కొవాగ్జిన్ టీకాల ప్రయోగాలు
- వెల్లడించిన నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్
- 25 కోట్ల డోసులు అవసరమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా
- త్వరలోనే కొవాగ్జిన్ ప్రయోగాలు పూర్తయ్యే అవకాశం
- రెండు వారాల్లో జైడస్ టీకా అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తు
భారత్‌లో పిల్లలపై కొవాగ్జిన్, జైడస్ కరోనా టీకాల సామర్థ్య పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైనట్లు నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ వెల్లడించారు. భారత్‌లో చిన్నారుల సంఖ్య భారీగానే ఉంటుందని.. ఈ వర్గానికి దాదాపు 25 కోట్ల డోసులు అవసరమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏ టీకా ఇస్తామనేది చెప్పలేమన్నారు. చాలా డోసులు అవసరముందని మాత్రం చెప్పగలమన్నారు.
భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు పిల్లలపై కొనసాగుతున్నాయని పాల్ వెల్లడించారు. అయితే, ఇది కేవలం రోగనిరోధకత సామర్థ్యాన్ని పరీక్షించడమే అయిన నేపథ్యంలో తక్కువ సమయంలోనే ప్రయోగాలు పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. జైడస్ రూపొందించిన టీకా ట్రయల్స్ సైతం పిల్లలపై జరుగుతున్నాయని తెలిపారు. రానున్న రెండు వారాల్లో తమ టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆ వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వాలా? వద్దా? అనేది కూడా అప్పుడే నిర్ణయించనున్నట్లు తెలిపారు.