Assam: వ్యాక్సినేషన్ వేగవంతానికి అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం
- టీకాల సేకరణకు ప్రైవేటు ఆస్పత్రులకు రుణం
- మూడు నెలల వరకు వడ్డీలేని రుణాలు
- ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 50 వేల మందికి టీకాలు
- 70 వేలే లక్ష్యంగా ముందుకు
వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసే దిశగా అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీకాలను సమీకరించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు వడ్డీరహిత రుణాలను మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శుక్రవారం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేశవ్ మహంత వెల్లడించారు. వ్యాక్సిన్ల సమీకరణ కోసం రుణాలు తీసుకున్న ఆసుపత్రుల నుంచి మూడు నెలల పాటు వడ్డీ వసూలు చేయబోమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 50 వేల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీన్ని 70 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉన్నట్లు పేర్కొన్నారు. రానున్న కొన్ని రోజుల్లో కేంద్రం నుంచి టీకాలు అందనున్నట్లు తెలిపారు.