Vijayawada: దుర్గమ్మ ఆలయానికి తగ్గిన హుండీ ఆదాయం.. ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు అధికారుల పాట్లు!

Reduced Hundi income for Durgamma temple

  • భక్తులు లేక బోసిపోతున్న ఇంద్రకీలాద్రి
  • నెలకు రూ. 50 లక్షలకు పడిపోయిన హుండీ ఆదాయం
  • వేతనాలకు చెల్లించాల్సింది రూ. 3 కోట్ల  పైమాటే
  • రెండు నెలలుగా వేతనాల బాకీ
  • రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామన్న ఆలయ ఈవో

కరోనా మహమ్మారి ప్రభావం బెజవాడ కనకదుర్గమ్మపైనా పడింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆంక్షల కారణంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. కరోనాకు ముందు రోజుకు 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకునేవారు. కానీ ఇప్పుడా సంఖ్య 500 నుంచి 1000కి పడిపోయింది. దీంతో హుండీ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాశ్వత ఉద్యోగులకు నెల, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలల వేతన బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరగడంతో రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆలయంలో 270 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరికి నెలకు రూ. 2 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కోటి రూపాయల వరకు చెల్లించాలి. అయితే, ప్రస్తుతం భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో నెలకు రూ. 50 లక్షల ఆదాయం మాత్రమే వస్తోందని అధికారులు చెబుతున్నారు.

కరోనాకు ముందు నెలకు హుండీ ఆదాయం రూ. 3 కోట్లకు పైనే ఉండేది. సాధారణ రోజుల్లో ఏడాదికి రూ. 200 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. మరోవైపు, భక్తులనే నమ్ముకుని జీవిస్తున్న కొండమీది చిరువ్యాపారులు, క్షురకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల ఇబ్బందులపై ఆలయ ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే వేతనాలకు ఇబ్బంది లేకుండా సర్దుబాటు చేశామని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. కానీ, వచ్చే నెల మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవన్నారు.

  • Loading...

More Telugu News