dcgi: భారత్‌లో విదేశీ సంస్థల వ్యాక్సిన్ల వినియోగానికి మార్గం సుగమం
- అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు
- భారత్‌లో పరీక్షలు అవసరం లేదు
- ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబరేటరీల ధ్రువీకరణ చాలు
విదేశీ సంస్థల కొవిడ్ టీకాల దిగుమతి, వినియోగాలకు మార్గం సుగమమైంది. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ప్రక్రియల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదం పొందిన పలు వ్యాక్సిన్లకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని చెప్పింది.
డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన అన్ని వ్యాక్సిన్లకు వర్తించేలా సవరణలు చేసినట్లు వివరించింది. అలాగే, అమెరికా, యూకే, జపాన్ సహా పలు దేశాల్లో ఆమోదించిన వ్యాక్సిన్లకు అనుమతులు ఉంటాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓతో పాటు భారత్‌లో అనుమతుల కోసం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ బ్రిడ్జ్ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
దిగుమతి అయ్యే వ్యాక్సిన్లు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబరేటరీల ధ్రువీకరణను పొంది ఉంటే చాలని చెప్పింది. కరోనా వ్యాక్సిన్ నేషనల్ ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ గతంలో చేసిన సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో టీకాల కొరతను అధిగమించేదుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ వ్యాక్సిన్లకు నేరుగా అనుమతులు ఇస్తోంది.